రాజకీయ నాయకుల మాట ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఊహించలేం. ముఖ్యంగా ఎన్నికల గడువు సమీపిస్తుంటే తమ కామెంట్ల నుంచి తామే యూటర్న్ తీసుకునే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యవహరించారని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ హైదరాబాద్ సైబర్ టవర్స్ వద్ద ఇటీవల ఐటీ ఉద్యోగులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ నిరసనలు ఏపీలో చేసుకోవాలని సెటైర్ వేశారు. అయితే, తాజాగా సెటిలర్లు, ముఖ్యంగా టీడీపీ ఓట్లు నష్టపోకుండా ఉండేలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా మాట్లాడారు.
ఖమ్మం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పార్క్, దివంగత ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలోని మహనీయుల స్థానంలో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందని, ఆయన విగ్రహాన్ని, ఆయన పేరున ఉన్న పార్కుని ప్రారంభించడం తన అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో అప్తుడుగా, విశ్వవిఖ్యాత నటుడిగా పేరుగాంచారని కీర్తించారు. భారతదేశంలో తెలుగువారికి గుర్తింపు రావడానికి ఎన్టీఆరే కారణమని ఎన్టీఆర్ అన్నారు. రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు గానీ.. ఎన్టీఆర్ మాత్రం ఆ రెండు పాత్రల్లో అద్భుతంగా జీవించాడని, రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆరే గుర్తుకు వస్తారని కొనియాడారు కేటీఆర్.
అయితే, తాజాగా కేటీఆర్ ఈ ప్రశంసల వెనుక లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యతిరేక వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో నష్టం చేకూరుస్తాయని భావించిన కేటీఆర్ తెలివిగా ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు దివంగత ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారని అంటున్నారు. కేసీఆర్ గురువు ఎన్టీఆర్ అంటూ ప్రశంసించడం వెనుక కారణం కూడా ఇదేనని చెప్తున్నారు. మరోవైపు కీలకమైన పది నియోజకవర్గాల్లో ఓట్లు పదిలంగా ఉంచుకునే ఎత్తుగడ కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు.
ఇటుటీడీపీ అనుకూల వర్గాలు శాంతించేలా అటు సెటిలర్ల ఓట్లు దక్కేలా చూసుకునేందుకు కేటీఆర్ ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందనేది విశ్లేషకుల మాట. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మద్దతుదారులు ఇప్పటికీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారి ఓట్లు ప్రభావిత స్థాయిలో ఉన్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్ నగర్, ఖైరతాబాద్, పటాన్ చెరు, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ లాంటి నియోజవర్గాల్లో ఉన్న సెటిలర్లు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసు చాన్సుందని పార్టీ పెద్దల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ సెటిలర్లను ఆకర్షించేందుకు కేటీఆర్ ఎన్టీఆర్పై పాజిటివ్ కామెంట్స్ చేసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.