టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఒక్క జగన్ కు సాధ్యం కాదని, ఆ అరెస్టు వెనుక ప్రధాని మోడీ, అమిత్ షా ఉన్నారని కొందరు రాజకీయ నాయకులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ తరహాలోనేే జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరా రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వం భుజంపై తుపాకీ పెట్టి కేంద్రం వ్యవహారాలు నడిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుపై కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని, అక్కడే పరిష్కరించుకోవాలని చెప్పారు.
బీజేపీని బలోపేతం చేసేందుకే పురందేశ్వరిని బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించారని, తాజా రాజకీయ పరిణామాలు కూడా బీజేపీ బలోపేతమే లక్ష్యంగా జరిగినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు ఇరుక్కున్నారన్నారు. బీజేపీ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని తాను నమ్ముతున్నానని చెప్పారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలన్నీ జీహుజూర్ అనేవేనని, బీజేపీ ఆశీస్సుల కోసం సాగిలపడేవేనని విమర్శించారు. టీడీపీని బలహీనపరిచి బీజేపీ ఎదగాలనుకుంటోందని, ఈ పద్ధతిని బీజేపీ చాలా రాష్ట్రాల్లో అనకొండ మాదిరి అమలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.