చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు, నిరసనలు చేపట్టవద్దని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, లోకేష్ సహా పలువురు నేతలు కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈసారి ఆంధ్రా సెటిలర్ల ఓట్లు, టీడీపీ అభిమానుల ఓట్లు బీఆర్ఎస్ కు పడవని, గాంధీ భవన్ కు ఆ ఓట్లు నడుచుకుంటూ వెళుతున్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే తెలుగు వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అని, రాముడైనా కృష్ణుడైన ఆయననేనని కేటీఆర్ కొనియాడారు. ఖమ్మంలోని లక్కవరం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఎన్టీఆర్ పార్కును ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నటనతో నాయకత్వంతో ప్రజల గుండెల్లో అన్నగారు జరగని ముద్ర వేశారని కేటీఆర్ ప్రశంసించారు. అందుకే తెలుగు వారందరికీ ఆయన ఆరాధ్య దైవం అయ్యారని చెప్పారు. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
ఇక, తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకు ఆ పేరు ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుందని కేటీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలల చాటుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ తో పాటు దక్షిణ భారత దేశంలో సీఎం పదవిని మూడుసార్లు ఎవరు అధిష్టించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, పార్టీని గెలిపించి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.