సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పసి పిల్లలకు పంపిణీ చేసే పాలను కూడా జగన్ వదలడం లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. జేబ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లను సైకో జగన్ తెంచుతున్నాడని దుయ్యబట్టారు. జగన్ అవినీతి దాహం పరాకాష్టకు చేరిందని, పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు పంపిణీ చేసే పాలను కూడా కల్తీ చేసి కాలకూట విషంగా మార్చాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటిదాకా టెట్రా ప్యాక్ లలో పాలు సరఫరా చేశామని, కానీ, ఇపుడు సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 3న ఆ పాల ప్యాకెట్లు తయారీ అయ్యాయని, డిసెంబర్ 2వరకు ఎక్స్ పైరీ డేట్ ఉందని, కానీ, సరఫరా చేసిన 2 రోజులకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలుతున్నాయని ఆరోపించారు. ఆ పాల ప్యాకెట్లు చూసిన తర్వాత రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదని షాకింగ్ కామెంట్లు చేశారు.