టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పందించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు తెలియకుండా చాలా తప్పులు జరిగే అవకాశముందని, అవి ఆయన దృష్టికి రాకపోవచ్చని సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి చంద్రబాబు టైం బాగోలేదని, అందుకే, కేసు వాయిదా పడడం…జడ్జి సెలవుపై వెళ్లడం…పండుగ సెలవులు రావడం..జరుగుతోందని అన్నారు.
ఇక, పొలిటికల్ గేమ్ లో భాగంగా పాత కేసులో పురోగతి రాగానే కొత్త కేసులు వస్తున్నాయని, గతంలో తనపై కూడా అలాగే కేసుల మీద కేసులు వేశారని తాను జైలుకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక, చంద్రబాబుపై కేసు పెట్టించిన వారికి ఇగో ఉంటుందని, సీఎస్ లు వారందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చంద్రబాబుపై బలమైన కేసులు పెట్టే అవకాశముందని అన్నారు. అయితే, ఆయన టైం మారగానే ఢిల్లీ నుంచి ఒక మనిషి వచ్చి ఆయనను బయటకు తీసుకువస్తారని సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు కేసులపై త్వరగా చార్జిషీటు వేసి..బెయిల్ మీద బయటకు తీసుకవచ్చి కేసు నడిపితే ప్రభుత్వానికి కూడా హుందాగా ఉంటుందని హితవు పలికారు. చంద్రబాబు న్యాయపోరాటం చేయాలని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలని అన్నారు. చంద్రబాబు స్థాయి, ఆరోగ్యం, మానసిక పరిస్థితిని పరిగణించాలని, ప్రపంచవ్యాప్తంగా పేరున్న గొప్ప మనిషి, విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని సుమన్ ఆకాంక్షించారు.
చంద్రబాబుకు మద్దతుగా గతంలో పనిచేశారని, తనను టీడీపీ మీటింగులకు కూడా పిలిచేవారని, కానీ, షూటింగులతో బిజీగా ఉండి వెళల్లేదని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారికే చెప్పానని, ఆ తర్వాత బీజేపీతో టీడీపీ పొత్తులో ఉందని, ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీకి మద్దతుగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.