టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నేతలు, కార్యకర్తలు, టిడిపి సానుభూతిపరులు, టిడిపి అభిమానులు, చంద్రబాబు అభిమానులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ వినూత్న నిరసన కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జగన్ కు వినిపించేలా ‘మోత మోగిద్దాం’ అని లోకేష్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు మోత మోగించి నిరసన వ్యక్తం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజలు ఇంట్లో, ఆఫీసులో, రోడ్లమీద, ఎక్కడ ఉంటే అక్కడ…. వాహనం మీద ఉంటే హారన్ కొట్టి, ఇళ్లలో ఉంటే ప్లేటు మీద గరిటతో, విజిల్ వేసి.. రకరకాలుగా శబ్దం చేస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మోత మోగించాలని లోకేష్ అన్నారు. ఆ మోత మోగించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా శబ్దం వినిపిద్దామని లోకేష్ అన్నారు. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు, తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది… నిష్కళంక రాజకీయ మేరు నగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా కదం తొక్కవలసిన సమయం ఇది అని లోకేష్ అన్నారు.