చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో నిరసనలు చేసుకోవాలని, తెలంగాణలో వద్దని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు కాక రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు రెండు పార్టీలకు సంబంధించిన గొడవ అని, హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఇక్కడ నిరసన చేయడం వల్ల ఐటీ కారిడార్ ఇమేజ్ దెబ్బతింటోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. కవిత ఢిల్లీలో ధర్నా చేయడంపై కూడా రేవంత్ విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రాజకీయాలపై లేదని రేవంత్ కు కవిత చురకలంటించారు. దేశం మొత్తానికి రాజధాని కాబట్టి ఢిల్లీలో ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు. తెలంగాణ అంశాలపై హైదరాబాదులో ధర్నా చేస్తే బాగుంటుందని, ఏపీ అంశాలపై చేస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను పెద్ద వివాదం చేస్తున్నారని, ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని కవిత విమర్శించారు. దేశంలో ఎంతో మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుంటారని, వారి న్యాయ విభాగాలు ఆ వ్యవహారాలు చూసుకుంటాయని అన్నారు. తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం అని అన్నారు. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం అని కవిత చెప్పారు.