తెలుగు వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న తమిళ కథానాయకుడు సిద్దార్థ్ కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అతను బెంగళూరులో తన కొత్త చిత్రం చిత్తాకు సంబంధించిన ప్రెస్ మీట్ నుంచి మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. అతణ్ని బలవంతంగా బయటికి పంపించేసింది ఒక గ్రూప్. తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా కావేరి జలాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతం అయ్యాయి. తమిళనాడుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ సినిమాలను కర్ణాటకలో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఇలాంటి సమయంలో గురువారమే రిలీజైన తన కొత్త చిత్రం చిత్తాకు సంబంధించి ప్రమోషన్ల కోసం బెంగళూరుకు వచ్చాడు సిద్ధు. అతను ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. కావేరి వివాదంపై ఆందోళన చేస్తున్న ఒక వర్గం అక్కడికి వచ్చింది. సిద్దార్థ్‌ను బెదిరించి.. ప్రెస్ మీట్ నుంచి అతను వెళ్లిపోయేలా చేసింది. సిద్ధు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. మామూలుగా సిద్ధు కొంచెం ఆవేశపరుడే కానీ.. ఈ విషయంలో మాత్రం అతను సంయమనం పాటించాడు. సున్నితమైన వివాదం కావడంతో ఆందోళనకారులకు, మీడియా వారికి నమస్కారాలు పెట్టి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
సిద్ధును కొనియాడుతున్న నెటిజన్లు.. సినిమా వాళ్లను ఈ వివాదంలోకి లాగడం సరి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక చిత్తా విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ డ్రామా. ఒక అమ్మాయికి, తన బాబాయికి మధ్య నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటి నిమిషా సజయన్ ఇందులో కథానాయికగా నటించగా.. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.