టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్ కేసులలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కేసుల పై ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ పలుమార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంతేకాదు, ప్రభుత్వానికి అనుకూలంగా…చంద్రబాబుకు వ్యతిరేకంగా సంజయ్ వ్యవహరిస్తున్నారని టీడీపీతో పాటు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సంజయ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీకి తొత్తుగా సంజయ్ పని చేస్తున్నారని ఆ ఫిర్యాదులో రామ్మోహన్ నాయుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన సంజయ్…ఓ పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ మెప్పు కోసం వైసీపీ కార్యకర్తగా మారి ప్రతిపక్షాలపై బురదజల్లుతున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబును విచారణ జరపకుండానే దేశమంతా ప్రెస్ మీట్ లు పెడుతూ ఆయనపై ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు, గోప్యంగా ఉంచాల్సిన దర్యాప్తు అంశాలను కోర్టులో సమర్పించడానికి ముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది.