స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టును హాట్ టాపిక్ గా మార్చడంతో పాటు సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం కోసం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. తన భర్త అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.
ఇన్ని రోజులు భర్త చాటు భార్యగా ఉన్న భువనేశ్వరి తన వ్యాపారాలేవో తాను చూసుకున్నారు. కానీ ఇప్పుడు భర్త జైల్లో ఉండటంతో కోడలు బ్రాహ్మణితో కలిసి ఆమె బయటకు వచ్చారు. రాజమహేంద్రవరంలోనే ఉంటూ బాబు అరెస్టుపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పార్టీ కార్యకర్తల దగ్గరకు భువనేశ్వరి వెళ్తున్నారు. మంచి వాగ్ధాటితో ఆమె ప్రజలను ఆకట్టుకుంటుండటం విశేషం. చంద్రబాబు అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, తెలుగు ప్రజల గుండె చప్పుడు అంటూ పోరాటానికి భువనేశ్వరి మద్దతు కూడగడుతున్నారు.
బాబు తెలుగు ప్రజల మేలు కోరే వ్యక్తి అని, ఆయన్ని జైల్లో పెట్టడం అన్యాయమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో భువనేశ్వరి విజయవంతమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో కొనసాగుతున్న మహిళల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి భువనేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు చేసిన డెవలప్మెంట్ను ప్రజలకు వివరించారు. అంతే కాకుండా వైసీపీని టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. ఒక మహిళనైన తనను ఉద్దేశించి వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. మొత్తానికి భువనేశ్వరికి ప్రజలను తనవైపు తిప్పుకునే లక్షణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.