టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. చంద్రబాబు రూ.371 కోట్లు దారి మళ్లించారన్న ఆరోపణల్లో నిజం లేదని, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదని విమర్శించారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన విచిత్రాన్ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరని చురకలంటించారు. ఏం తప్పు చేశారని 19 రోజులుగా ఆయనను జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఏ చదివిన నాకు హెరిటేజ్ కంపెనీని చంద్రబాబు అప్పగించారని, 3 నెలల్లోనే పరిశ్రమను నడిపించే స్థాయికి వెళ్లానని అన్నారు. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బిడ్డల్లాంటి వాళ్లని, కుటుంబ పెద్దను హింసించి జైల్లో పెడితే బిడ్డలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లను కూడా జైల్లో పెడుతున్నారని, తాను కూడా ఒక స్త్రీ అని, ఈ ఘటనలు తాను మర్చిపోనని హెచ్చరించారు. తనపైనా రకరకాల మాటలతో దాడి చేశారని, అయినా భయపడలేదని,. పనిలేని వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సృష్టికి ఆడదే మూలమన్న విషయం వారు మర్చిపోతున్నారని చెప్పారు.
ఎన్ని అడ్డుంకులు సృష్టించినా యువగళం పాదయాత్ర ఆగలేదు..ఆగదు అని అన్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి 70 ఏళ్లు అని, అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపడకుండా అందరూ ముందుకొచ్చి ఓటేయాలని, ధైర్యంతో ముందుకు సాగితే ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్… సేవ్ డెమొక్రసీ.. సత్యమేవ జయతే అని చెప్పారు.
ఈరోజు ప్రజలు చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడుతున్నారంటే ఆయన ఏమీ తప్పు చేయలేదని నమ్మడం వల్లనే కదా. ఆయన ఊపిరిలో ఎప్పుడూ ప్రజలే ఉంటారు. ఏం చేస్తే ప్రజలు సంపాదనపరులై పేదరికం నుంచి బయటపడతారు? రాష్ట్రం అభివృద్ధికి ఏం చేయాలి? … చంద్రబాబుగారి ఆలోచనల్లో ఎప్పుడూ ఇవే ఉంటాయి.… pic.twitter.com/qwOmtX6Gks
— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 27, 2023