మామూలుగా అయితే ఈపాటికి దేశమంతా సలార్ ఫీవర్తో ఊగిపోతుండాలి. కానీ సెప్టెంబరు 28కి అనుకున్న ఆ సినిమా ఆ డేట్ నుంచి వాయిదా పడటం ప్రభాస్ అభిమానులనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్త రిలీజ్ డేట్ మీద కొన్ని వారాల నుంచి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మార్చికి వాయిదా వేసినట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సలార్ రాక కోసం మరీ అంత ఎదురు చూడాల్సిన పని లేదట.
ఇంకో మూడు నెలల్లో.. అంటే క్రిస్మస్కే ఈ సినిమా విడుదల కాబోతోందట. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం హోంబలె ఫిలిమ్స్ వాళ్ల నుంచి ధ్రువీకరించుకుని ఈ న్యూస్ పోస్ట్ చేశాడు. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ హోంబలే వాళ్లు క్రిస్మస్ రిలీజ్ గురించి మెయిల్స్ కూడా పంపించేశారని ఆయన వెల్లడించాడు. కాబట్టి ఈ న్యూస్ వాస్తవమే అనుకోవచ్చు. ఈ శుక్రవారం నాడు హోంబలె ఫిలిమ్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారట.
ఈ వార్త నిజం అయితే క్రిస్మస్కు ఒక మెగా క్లాష్ చూడబోతున్నట్లే. పఠాన్, జవాన్ సినిమాలతో మంచి ఊపుమీదున్న షారుఖ్ ఖాన్.. తన కొత్త సినిమా డుంకిని క్రిస్మస్కే షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా క్రిస్మస్కే వస్తుందని ఇటీవలే షారుఖ్ కూడా ధ్రువీకరించాడు. ఇలా రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజైతే బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం.