టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టిడిపి నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహంలా గర్జించే చంద్రబాబును జైల్లో పెట్టి అనవసరంగా రెచ్చగొడుతున్నారని భువనేశ్వరి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడడమే చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముకు ఆశపడే కుటుంబం తమది కాదని, ప్రజల ఆధారాభిమానాలే కొండంత అండ అని చెప్పారు. జైలు నుంచి సింహంలో బయటకు వచ్చి ప్రజల కోసం మరింత అంకితభావంతో చంద్రబాబు పనిచేస్తారని చెప్పారు.
ఏం తప్పు చేశారని 17 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టి నిర్బంధించారని ప్రశ్నించారు. ఏనాడూ బయటకు రాని తాను, తన కోడలు బ్రాహ్మణి ప్రజల కోసం బయటకు వచ్చామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టామని చెప్పుకొచ్చారు. ఆనాడు హైటెక్ సిటీని చంద్రబాబు నిర్మిస్తుంటే నవ్విన వారే ఈనాడు పొగుడుతున్నారని అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి వ్యక్తులే బ్రిటిష్ పాలకుల కాలంలో జైలుకు వెళ్లారని, ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారని చెప్పారు.
చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తున్న ఐటి ఉద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వీసాలు కావాలా అని ప్రశ్నించారు. ఈరోజు చంద్రబాబును రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి, అచ్చం నాయుడు ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో ఆయనకు కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా లేదని ఆరోపించారు.