‘తానా‘ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర‘ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది . ముఖ్యంగా ఇప్పటికే చర్చల్లో ఉన్న ‘నిరంజన్ శృంగవరపు‘, ‘నరేన్ కొడాలి‘ ల తో పాటు గతంలోనే పోటీచేసి, అనేక పదవులను నిర్వహించి ఉన్న ‘శ్రీనివాస గోగినేని‘ కూడా రంగంలో ఉంటారన్న విషయం మరింత ఉత్కంఠను రేపింది. ఇప్పటివరకు ఉన్న అంచనాలు తారుమారు కావటమే గాకుండా ఇపుడు పోటీ రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజానిజాల గురుంచి వివిధ వర్గాలనుంచి, ప్రముఖ వ్యక్తుల నుంచి మెయిల్ కు, ఫోన్ కి వస్తున్న రెస్పాన్స్ ఈ విషయం పై జనంలో ఉన్న ఆసక్తిని, తీవ్రతను సూచిస్తోంది.
వేర్వేరు వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలు, ఇస్తున్న సమాచారం చూస్తే..’పబ్లిక్ టాక్ ‘ఇలా ఉంది…
‘నిరంజన్ శృంగవరపు‘ కి ప్రస్తుత ‘తానా ‘అధ్యక్షుడు ‘జయ శేఖర్ తాళ్లూరి‘ ,‘నరేన్ కొడాలి‘ కి ‘తానా ‘మాజీ అధ్యక్షుడు ‘సతీష్ వేమన‘, మరియు అనుభవజ్ఞుడు అయిన ‘శ్రీనివాస గోగినేని‘ కి ప్రముఖ ఎన్నారై,’తానా ‘మాజీ అధ్యక్షుడు ‘జయరాం కోమటి‘ఆశీస్సులు ఉన్నట్టుగా అర్థమవుతోంది.
జనాల్లో విపరీతంగా నడుస్తున్న చర్చ, ‘నమస్తే ఆంధ్ర‘ కథనం తర్వాత మరిన్ని విషయాలు బయటకు రావడంతో…. ‘తానా‘ రాజకీయాల్ని గత కొంతకాలంగా శాసిస్తున్న ‘ముగ్గురు‘ ప్రముఖులు… భవిష్యత్తు కార్యారచణపై ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? కొత్త నాయకత్వంలో ‘తానా‘ భవిష్యత్తు ఎలా ఉండ నుంది? ఎవరు గెలిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలపై ‘తానా ‘వ్యవహారాలపై మునుపటి నుంచి అవగాహనమున్న అనేక మంది సభ్యులు, నాయకుల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ‘తానా‘ లో మరిన్ని మంచి మార్పులు కోరుకుంటున్నవారు, అలాగే ‘తానా‘ పై ఆధిపత్యం కొనసాగించాలనుకుంటున్న వారు, కొత్తగా ఆధిపత్యం పొందాలనుకుంటున్న వారు ప్రణాళికలు రూపొందించుకుంటూ వాటి పర్యవసానాలు బేరీజు వేసుకుంటన్నారట.
అయితే, మరో కీలక విషయం ఏంటంటే… పలువురు ప్రముఖులు పోటీలో ఉంటారు అనుకుంటున్న వారి ముగ్గురితో చర్చించి మునుపటి తరాన్ని కొత్త తరాన్ని ఏకం చేయగలిగిన, ‘తానా ‘వ్యవహారాలు, కార్యక్రమాలపై అవగాహన ఉన్న ముగ్గురిలో ఒక సీనియర్ మోస్ట్ ని ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దీనివల్ల అటు పాతతరం సీనియర్లు, మహిళలు, యువత అందరికీ ‘తానా‘ను మరింత దగ్గర చేసే అవకాశం, మరిన్ని సేవా కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా చేపట్టి ‘తెలుగు‘ ఖ్యాతిని విస్తరింపజేయగలదని అంటున్నారు.
అమెరికా , ఇండియా – మొత్తం గా తెలుగు ప్రజానీకానికి సుపరిచతం అయిన ‘తానా‘ భవిష్యత్తు అంటే సాధారణ విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగు ప్రముఖులకు సంబంధించిన సబ్జెక్ట్ ‘తానా‘ కాబట్టి చాలా మీడియా సంస్థలు ‘తానా ‘వ్యవహారాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే వెరసి రాబోయే కాలంలోో మరిన్ని ఆసక్తికర పరిణామాలు ఊహించవచ్చు.