2013లో సెప్టెంబర్ 23వ తేదీన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన జగన్ బెయిల్ పై వచ్చారు. అయితే, ఆ రోజు బెయిల్ పై వచ్చిన జగన్ ఈనాటి వరకు మళ్లీ జైలుకు వెళ్లలేదు. ఆయన జైైైలుకు వెళ్లకపోగా…తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును జైలుకు పంపించారు. ఇంకా, లోకేష్ ను కూడా త్వరలోనే జైలుకు పంపేందుకూ జగన్ ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ కు లోకేష్…బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సంచలనం రేపుతోంది. జైలు మోహన్ కు పదో జైలు డే శుభాకాంక్షలు అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.
42 వేల కోట్లు కొట్టేసి, 38 ఈడీ, సీబీఐ కేసుల్లో ఏ1, ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాలరాస్తూ, నీతిమంతులను జైలుకు పంపుతున్నాడని మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జగన్ బయట..జనంలో ఉండాల్సిన బాబుగారు జైలులో ఉన్నారని చురకలంటించారు. జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా సెటైర్లు వేశారు. వైఎస్ హయాంలో భారీ అవినీతి చేసిన జగన్ పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారని, ఈ రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయాలని పంచులు వేశారు. ఈ రికార్డు సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్ గోడలపై, పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని చురకలంటించారు.