టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో చంద్రబాబు పేరు పాత ఎఫ్ఐఆర్ లో లేదని, తాజాగా చేర్చి ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చెప్పిన విధంగా సీఐడీ చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుపై ఏపీ రాజకీయాలలో సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.
ఈ కేసులో ఆర్థిక అంశాలు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయని, ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉన్నందున ఈ కేసును సీబీఐ విచారణ జరపాలని అన్నారు. హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె. లక్షీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. మరి, ఉండవల్లి పిల్ ను ఏపీ హైకోర్టు ఎప్పుడు విచారణ జరుపుతుంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
అయితే, ఉండవల్లి కామెంట్లపై టీడీపీ నేత పట్టాభి స్పందించారు. మద్యం స్కాంపై, రాజమండ్రి చుట్టూ అక్రమ ఇసుక రీచ్ లపై, వైసీపీ నేతల భూకబ్జాలపై మాట్లాడని ఉండవల్లి ఇపుడు మాత్రం సీబీఐ విచారణ కోరుతున్నారని దుయ్యబట్టారు. ఆ పిల్ లో ప్రేమ్ చంద్రా రెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.