రాజకీయాల్లో కొన్ని గీతలు దాటటం ఎవరికి ఏ మాత్రం మంచిది కాదు. గీతలు దాటే వేళ.. వాటిని పెద్దగాపట్టించుకోం కానీ ఆ తర్వాత ఆ గీతలే తెగ ఇబ్బంది పెట్టేస్తాయన్న మాటను సీనియర్ల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో పగలు.. ప్రతీకారాలు కామనే అయినప్పటికీ.. ఒక స్థాయి తర్వాత వాటికి చెక్ చెప్పకుంటే అందరికి నష్టమే అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఏపీలో ఇప్పుడు విపక్ష నేతపై స్కిల్ స్కాం జరిగిందని పేర్కొంటూ వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కాం జరిగిందన్నదానికి వినిపిస్తున్న వాదనల్లో రూ.370 కోట్లకు మొత్తానికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఈ స్కాంకు సంబంధించిన వాదనల్నిచూస్తే.. ఇరు వర్గాలకు చెందిన వారుపాయింట్ మీద మాట్లాడే విషయంలో ఒకే తీరును ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ఎవరికి వారు తమకు అనువైన వాదనను వినిపిస్తున్నారు. ఇదే సమయంలో తమకు ప్రతికూలంగా ఉండే పాయిట్ల జోలికి వెళ్లట్లేదు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులోరూ.370 కోట్లు జరిగిందన్నది సీఐడీ వాదన. దీనికి అనువుగా గతంలో కాగ్ లేవనెత్తిన అభ్యంతరాల్ని కోట్ చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి జగన్ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో మరీ ముఖ్యంగా 2021లో రూ.41,043 కోట్ల మొత్తానికి స్పెషల్ చెల్లింపులు చేసింది. చంద్రబాబు హయాంలోని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు విషయంలోనూ.. 2021లో స్పెషల్ బిల్ పేరిట విడుదల చేసిన భారీ మొత్తాలపై కాగ్ ఒకేలాంటి ప్రశ్నల్ని సంధించింది. భారీ మొత్తంలో బిల్లులు పీఏవో పరిశీలన లేకుండా నేరుగా ఖజానా నుంచి చెల్లింపులు చేశారని.. ఆ డబ్బులు ఎటు పోయాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి.
మరింత లోతుగా ప్రశ్నిస్తే.. అవన్నీ స్పెషల్ బిల్లులని.. ఇందులో రూ.10,875 కోట్లను పీడీ ఖాతాల్లో జమ చేశామని ఏపీ ఆర్థిక కార్యదర్శి రావత్ సమాధానం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పధకాలకు సంబంధించిన నిధులు దాదాపు రూ.9వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిని జగన్ ప్రభుత్వం పీడీ ఖాతాల సాయంతో తర్వాతి ఏడాదికి మైగ్రేట్ చేసి.. ఖర్చు చేశారు. వీటికి అటు ట్రెజరీ కానీ.. పీఏవో కానీ ఆమోదించింది లేదు. అలాంటప్పుడు ఎలా ఖర్చు చేస్తారని కాగ్ ప్రశ్నించింది. ఒక ఏడాది ఖర్చు చేయాల్సిన డబ్బును మరో ఏడాది ఎందుకు ఖర్చు చేశారు? అన్నది ప్రశ్నగా మారింది.
టీడీపీ హయాంలో అధికారులు ఎలా అయితే కాగ్ కు విషయాన్ని వివరించారో.. జగన్ ప్రభుత్వం సైతం రెండు పేజీల నోట్ పంపింది. కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని స్కిల్ డెవల్ పెంట్ లో స్కాం జరిగిందని భావిస్తే.. మరి స్పెషల్ బిల్లుల వ్యవహారం.. గత ఏడాది బిల్లులు దాదాపు రూ.10వేల కోట్ల బిల్లులు కూడా స్కాం కిందనే లెక్కలోకి వేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు స్కిల్ డెవల్ మెంట్ కోసం ఖర్చు చేసిన రూ.310 కోట్ల మొత్తాన్ని స్కాం ఖాతాలోకి తీసుకెళితే.. సమీప భవిష్యత్తులో జగన్ సర్కారు సైతం తమ హయాంలో జరిపిన స్పెషల్ చెల్లింపులకు స్కాం మరక వేసే అవకాశం ఉందంటున్నారు. మరి..ఈ వాదనకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలాంటి సమాధానం ఇస్తారో?