సినిమాల్లో లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు పొంది, రాజకీయాల్లో అదే ముద్ర వేసుకోవాలని ఆరాటపడుతున్న మాజీ ఎంపీ విజయశాంతికి ఈ విషయంలో నిరాశే ఎదురవుతున్న సంగతి తెలిసిందే. బీజేపీలో ఉన్న విజయశాంతి ఇటీవల తనదైన శైలిలో ట్వీట్లు చేశారు. దీంతో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాములమ్మ స్పందిస్తూ తాను కొందరు నేతల టైప్ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ “తెలంగాణ ఇచ్చిన సోనియాను అభిమానంతో చూస్తాను. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న రాహుల్ వ్యాఖ్యలకు సమర్థిస్తున్నాను. “ అంటూ విజయశాంతి ఇటీవల ట్వీట్ చేశారు. విజయశాంతి ఇలా ట్వీట్ చేయడంతో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆమె పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా తన పార్టీ మార్పుపై రాములమ్మ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని విజయశాంతి తెలిపారు.
కొంతమంది తమ పార్టీ నేతలే పనిగట్టుకొని రాములమ్మ బీజేపీకి దూరం అంటూ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదని పలువురు నేతలను టార్గెట్ చేస్తూ… అంతర్గత విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిస్తానన్నారు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో స్పష్టంగా తెలియజేశానని విజయశాంతి తెలిపారు.
పార్టీ మార్పు విషయంలో విజయశాంతి ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, పార్టీలో ఉండి తన తదుపరి అడుగులు వేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని తేల్చిచెప్పడం వెనుక తనను టార్గెట్ చేసిన నేతలకు తగు రీతిలో ఆమె కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. ఒకవేళ పార్టీ తనను తగు రీతిలో గౌరవించకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే రాములమ్మ పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.