శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలేసి తొడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యను స్పీకర్ తమ్మినేని మందలించి తొలి తప్పు కాబట్టి వదిలేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య …అంబటి రాంబాబుపై బాబు విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబే ముందు తనను రెచ్చగొట్టారని, మీసం మెలేసి తొడ గొట్టారని, తన వృత్తిని అవమానించాడని ఆరోపించారు. రా చూసుకుందాం అని అంబటి అనడంతో తాను స్పందించానని అన్నారు.
స్పీకర్ తో అబద్ధాలు చెప్పించారని, మంద బలంతో వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. సభలో తనతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమను కూడా వైసీపీ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లి సీఎం అయిన అన్నగారిని గుర్తు చేసుకోవాలన్నారు. తనలా ధైర్యంగా మాట్లాడేవారు కొందరే అని, వైసీపీ నేతలకు దీటుగా జవాబిచ్చే సరికి బిత్తర పోయారని చెప్పారు.
జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని, టీడీపీ వాటిని ఎదుర్కొంటుందని చెప్పారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని స్పీకర్ ను కోరామని, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని కోరామని అన్నారు.నీరో చక్రవర్తిలా జగన్ వ్యవహరిస్తున్నాడని, జగన్ తీరు ఎవరికీ అర్థం కాదని దుయ్యబట్టారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై జగన్ కు లేదని చురకలంటించారు.