టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు, తనకు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేశారు. సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడనుంది.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సెప్టెంబరు 21 హైకోర్టులో విచారణ జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రికవరీ కన్నా కుట్ర కోణం వెలికితీయడం ముఖ్యమని సీఐడీ తరఫు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని, ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారణ జరపాల్సి ఉందని అన్నారు. ఈ కేసు విచారణను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదని, ఐదు రోజుల కస్టడీ కావాలని కోరారు. సీఐడీ విచారణలో నిజానిజాలు బయటపడతాయని కస్టడీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారని అన్నారు. చంద్రబాబుకు సీఐడీ కస్టడీ అవసరం లేదని, గత నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అంటున్నారని ఆరోపించారు. మరోవైపు, అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేరుస్తూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులు చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరారు. దానిపై విచారణను కూడా కోర్టు రేపటికి వాయిదా వేసింది.