టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించాలనే ఉంది కానీ.. ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనని..కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యామని ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్టును సున్నితమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. అయితే, అది రాజకీయ పరమైన సమస్య అని, చిత్ర పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా, మతపరంగా ప్రకటనలు చేయదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు విషయంపై మాట్లాడాలని ఉన్నప్పటికీ.. మాట్లాడలేక పోతున్నామన్నారు. అందుకని దీని మీద కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేమని చెప్పారు. “పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే మేం రాజకీయనాయకులం కాదు. మీడియా వాళ్ళం కాదు. కేవలం సినిమాలు నిర్మించడానికి వచ్చాం. సినిమాలు తీస్తాం. అంతే“ అని సురేష్ వ్యాఖ్యానించారు.
ఇటీవల కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయ ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదని సూచించారు. చంద్రబాబు తెలుగు సినీ రంగానికి మేలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే, ఆయనకన్నా ముందు అనేక మంది కూడా చేశారన్నారు. దివంగత రామానాయుడు టీడీపీ ఎంపీగా గెలిచారని గుర్తు చేశారు. అయితే, అది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు.
సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగితే.. కుదరదని దగ్గుబాటి సురేష్ అన్నారు. చాలామంది ముఖ్యమంత్రులు పరిశ్రమకి చాలా చేశారని అన్నారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి చాలా హెల్ప్ చేశారని తెలిపారు. చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకి చాలానే చేశారని, కానీ, రాజకీయ విషయాలపై మాత్రం తాము స్పందించడం సరికాదన్నారు. ఏపీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అసలు మాట్లాడలేమన్నారు.