జంట కవులు .. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు సోషల్ మీడియా జనాలు పెట్టుకున్న పేర్లివి. స్కిల్ డెవలప్మెంట్ కేసును పరిశోధిస్తున్న సీఐడీ విభాగాన్ని నడిపిస్తున్న సంజయ్, కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదిస్తున్న సుధాకర్ రెడ్డి కలిసి తమ పనేదో తాము చేసుకోకుండా.. అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
పోనీ ఈ కేసులో వాళ్లిద్దరూ బలమైన వాదనలు వినిపిస్తున్నారా అంటే అదీ లేదు. అర్థరహితమైన వాదనలు, ప్రశ్నలు అడిగితే పొంతన లేని సమాధానాలతో నీళ్లు నములుతున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి రాజకీయ నాయకుల్లాగా ప్రెస్ మీట్లు, మీడియా ఇంటర్వ్యూలు ఏమిటో అర్థం కాని విషయం. ఆల్రెడీ లోకల్ మీడియా వాళ్ల గాలి తీసేసింది. ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్లతో జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టారు. అది చాలదని ఏకంగా ఇప్పుడు ఢిల్లీలో ఈ ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఏం అవగాహన ఉండదని అనుకున్నారో ఏమో.. ఈ సమావేశానికి నేషనల్ మీడియా ప్రతినిధులను కూడా పిలిచారు. కానీ వాళ్లలో చాలామంది కేసు పూర్వాపరాలు తెలుసుకునే ప్రెస్ మీట్లో అడుగు పెట్టారు. వాళ్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు లేక సంజయ్, సుధాకర్ రెడ్డి నీళ్లు నమిలిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసులో అజేయ్ కల్లాం, ప్రేమ్ చంద్రా రెడ్డి లాంటి వాళ్లను వదిలేసి చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారు అంటే వాళ్లకు సంబంధమే లేదు అనేశారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమున్నాయంటే తమకు రాగానే ఇస్తామన్నారు. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. లేదా పొంతన లేని ఆన్సర్లు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఇక్కడ పోయిన పరువు చాలదని ఢిల్లీలో కూడా జగన్ సర్కారు పరువు తీశారంటూ ఈ జంట కవులపై కౌంటర్లు పడుతున్నాయి.