సంచలనంగా మారిన స్కిల్ స్కాంపై మరో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది ఏపీ సీఐడీ. దేశ రాజధాని ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ అశోకాలో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాత్రమే ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ కు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ మీడియా సంస్థను అనుమతించకపోవటం గమనార్హం. అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన సాక్షి మీడియా సంస్థకు చెందిన ప్రతినిధులను మాత్రం అనుమతించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ గురించి తెలుసుకొని వెళ్లిన తెలుగు మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది.
ఏపీకి సంబంధించి అంశం.. ఆ రాష్ట్ర ప్రజాధనంతో పెట్టే ప్రెస్ మీట్ కు తెలుగు మీడియా ప్రతినిధులను ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించటంతో అక్కడి వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని.. తామేమీ చేయలేమని చేతులు ఎత్తేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడి నుంచి ఎవరు ఈ తరహా ఆదేశాలు జారీ చేశారు? అని ప్రశ్నించగా సమాధానం చెప్పని పరిస్థితి.
ఆహ్వానం అందని ఇంగ్లిషు.. హిందీ పత్రికలు.. టీవీ చానళ్లకు సంబంధించిన వారిని సైతం లోపలకు అనుమతించలేదు. ఇక.. మలయాళీ విలేకరులను కూడా అనుమతి లేదని తిప్పి పంచటం ఆశ్చర్యం వ్యక్తమయ్యేలా చేసింది. ఇలాంటి పరిస్థితిలోనే ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అక్కడకు రావటంతో ఆయన్ను ఉద్దేశించి పలువురు జర్నలిస్టులు.. జర్నలిస్టు సంఘం నాయకుడిగా తెలుగు మీడియాకు అనుమతి ఇవ్వకపోవటం ఏమిటి? అని ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ గదిలోకి వెళ్లిపోయారు.
ఏపీ భవన్ లో ఉచితంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నా.. అందుకు భిన్నంగా లక్షలు ఖర్చు చేసి మరీ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కేసులో అరెస్టు అయిన ఏడుగురు యాంటిసిపేటరీ బెయిల్ పొందారని.. మరో ఏడుగురిని ఇంకా అరెస్టు చేయాలన్న సంజయ్ మాటలతో కొందరు విలేకరులు.. అజేయ కల్లం.. ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించగా ఆయన బదులిస్తూ.. ‘‘అజేయ కల్లం అనాడు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు’’ అని చెప్పారు. ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని అడిగినప్పుడు.. ‘‘ప్రేమచంద్రారెడ్డి తన బాస్ గా ఉన్న సీఎం ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీ ఘంటా సుబ్బారావు మార్గదర్శకంలో పని చేశారు’’ అని చెప్పారు.