తప్పనిసరి పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని జగన్ ఎన్నికలు జరుపుతున్నారని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తరహాలో ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, మావోయిస్టు ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఎన్నికల్లో పోరాడామని చెప్పారు.
అయితే, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, తమ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో దిగుతామని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమని, ఆ నిర్ణయాన్ని ఒకరిద్దరు నేతలు వ్యతిరేకించినా దానిని పరిగణలోకి తెసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆ మాటకొస్తే వైసీపీ నేతలు గతంలో చాలా ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఓటమి భయంతో వైసీపీ చాలాసార్లు అసలు పోటీనే చేయనేలేదని గుర్తు చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అచ్చెన్న…. రాష్ట్రాభివృద్దిలో ప్రధాన భూమిక యువతదేనన్నారు. రెండేళ్లుగా యువత, విద్యార్థులను ప్రభుత్వం పట్టించు కోలేదని , జగన్ను యువత నిలదీయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని అన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ కళాశాలలు తిరిగి యువతను రెచ్చగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ కు యువత బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.