మాజీ మావోయిస్టు సమ్మయ్య అంత్యక్రియలు మధ్యలో ఆగిపోవటం ఒక ఎత్తు అయితే.. వర్షం పడుతున్న వేళ అంత్యక్రియలు మీరే చేసుకోడంటూ పోలీసుల చిత్తానికి వదిలేసి.. వెళ్లిపోయారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా విస్తుపోతున్నారు. ఇలా జరగటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అసలేం జరిగిందంటే..
మాజీ మావోయిస్టు సమ్మయ్య 2008లో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు.
అతగాడికి పునరావాసం కింద నాటి ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. అయితే.. తర్వాతి కాలంలో అతడికి కేటాయించిన భూమిని ప్రభుత్వం.. తన అవసరాల కోసం తీసుకొని మరోచోట భూమిని కేటాయించినట్లుగా సమ్మయ్య.. ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అయితే.. ఈ భూమిని అధికార పార్టీకి చెందిన నేత ఒకరు ఆక్రమించినట్లుగా సమ్మయ్య ఆరోపించేవారు. అయితే.. సమస్య పరిష్కారం కాలేదు కానీ.. సమ్మయ్య మాత్రం అనారోగ్యంతో మరణించారు.
దీంతో.. తన తండ్రి ఏ భూమి కోసం పోరాడాడో.. అదే భూమి వద్ద అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా డెడ్ బాడీని సదరు వివాదాస్పద భూమి వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వివాదాస్పద భూమిలో అంత్యక్రియలు చేయొద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తన తండ్రి శవానికి అంత్యక్రియలు చేసుకోవాలంటూ పోలీసులకు వదిలేసి వెళ్లిపోయారు. అంత్యక్రియల సమయంలో వర్షం పడుతుండటంతో డెడ్ బాడీ వర్షంలో తడుస్తూనే ఉంది. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.