టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఆ కేసులో ఏపీ సిఐడి తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపిస్తున్నారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో పలమార్లు మాట్లాడారు. సాధారణంగా కేసుల గురించి లాయర్లు ఒకటి రెండు మాటలు చెప్పి వదిలేస్తుంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై పెద్దగా విమర్శలు చేయడానికి ఇష్టపడరు.
కానీ, చంద్రబాబు విషయంలో మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏఏజీ కాకుండా వైసిపి కార్యకర్తను అని పొన్నవోలు చెప్పుకుంటే బాగుంటుందని చురకలంటించారు. ఇటువంటి వ్యక్తుల వల్లే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పొన్నవోలు తన వ్యక్తిగత సెక్యూరిటీని 8 మందికి పెంచుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ గురించి మాట్లాడుతూ కూడా పొన్నవోలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఒక వికెట్ పడిపోయిందా? ఇంకా మూడు నాలుగు వికెట్లు పడతాయి అంటూ మీడియా ముందు పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, ప్రభుత్వానికి అనుకూలంగా, జగన్ సొంత మనిషిలాగా పొన్నవోలు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పొన్నవోలుతోపాటు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.