రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సోమవారం నాడు చంద్రబాబుతో జైలులో తలైవా ములాఖత్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన రజనీకాంత్ ఆయనకు సంఘీభావంగా నారా లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు పోరాటయోధుడు అని, ఇటువంటి పరిస్థితులను ఆయన దీటుగా ఎదుర్కొనగలరని లోకేష్ కు రజనీ ధైర్యం చెప్పారు.
చాలా కాలంగా చంద్రబాబు, రజనీకాంత్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ అన్నగారితోపాటు చంద్రబాబుపై కూడా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని ఎన్టీ రామారావు ఆశయాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. అయితే, ఆ సందర్భంగా రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత అర్థమైందా రాజా అంటూ తలైవా కూడా వైసీపీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సురేష్ ప్రభు బాసటగా నిలిచారు. చంద్రబాబు తన స్వేచ్ఛకు దూరం కావడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాబలం ఉన్న టీడీపీ అధినేతగా చంద్రబాబు స్థాయి, వయసుకు తగ్గట్టు వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తాను ప్రయాణంలో ఉన్నానని, తనకు చంద్రబాబు అరెస్టు విషయం ఆలస్యంగా తెలిసిందని చెప్పారు. గతంలో, సురేష్ ప్రభు రైల్వే శాఖా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.