ఏపీ ప్రభుత్వ తీరుపై, జగన్ పాలనపై మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. జగన్ వి కక్ష్యాపూరిత రాజకీయాలని ఆయన విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టును చింతా మోహన్ ఖండించారు. ఈ సందర్భంగా కేంద్రం, జగన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దలు అండలేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అంత సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఎంతో కష్టపడి పైకి వచ్చారని, ఒక్కో మెట్టు ఎక్కుతూ 1978 నుంచి ఇప్పటివరకు రాజకీయాలు చేశారని చింతా అన్నారు.
చంద్రబాబు కచ్చితంగా తప్పు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాం అనేది స్కామే కాదని, ఇటువంటి వ్యవహారాలు దేశంలో ఎన్నో జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి అక్రమ అరెస్టులు చేసినందు వల్ల ముఖ్యమంత్రిగా ఎవరూ పని చేయలేరని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబును జైలుకు పంపడం దారుణమైన విషయమని, ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో కొన్ని జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదని అన్నారు. చంద్రబాబు రిమాండ్ తీర్పులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులో అయినా చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కోర్టులో ఎక్కువ కాలం నిలబడదని అన్నారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు వసతులు, రక్షణ సరిగా లేవని అన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో జగన్ లండన్ లో ఉన్నారని, ఢిల్లీ పెద్దలు జి20 సమావేశంలో ఉన్నారని, అటువంటి సమయంలోనే ఆయన అరెస్టు జరగడం కాకతాళీయం కాదని అన్నారు. ఇక, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయారని విమర్శలు గుప్పించారు