చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కొండా బీజేపీ గూటికి చేరబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. తాను టీఆర్ఎస్ పార్టీలో మళ్లీ చేరాలంటే..ఈటెల రాజేందర్ లేదా హరీశ్ రావులలో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని కొండా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఏకంగా గులాబీ బాస్ ను కొండా టార్గెట్ చేయడం, ఆయన పార్టీ అధ్యక్షుడిగా వద్దని చెప్పడం కలకలం రేపింది. దీంతో, కొండాకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కొండా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీఆర్ఎస్ వ్యతిరేకులందరినీ ఒక్కతాటిపైకి చేర్చి తెలంగాణలో కొత్త పార్టీ పెడతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
అంతటితో ఆగని కొండా…తెలంగాణవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేకులతో స్వయంగా భేటీ అవుతానని ప్రకటించడం షాకింగ్ గా మారింది. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను దారుణంగా దోచుకుంటోందన్న కొండా…టీఆర్ఎస్ తీరు నచ్చకే కాంగ్రెస్ లో చేరాననన్నారు. కానీ, కాంగ్రెస్ లో పోరాడే తత్వం పోయిందని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.
టీఆర్ఎస్ అరాచకాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్ఎస్ వ్యతిరేకులందరినీ ఒక్కచోటికి చేర్చి తగిన బుద్ది చెబుతానని ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, కొరకరాని కొయ్యగా మారిన కొండా వ్యాఖ్యలపై గులాబీ బాస్ కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.