టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హౌస్ కస్టడీ వస్తుందో లేదో అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆ వ్యవహారంపై తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆయన అరెస్టు, రిమాండ్ కు సంబంధించి మూడు పిటిషన్లను ఈరోజు హైకోర్టులో దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్, చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని, అరెస్టు చేసిన విధానం కూడా సరిగా లేదని శ్రీనివాస్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించి రేపు విచారణ చేపడతామని ప్రకటించింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు, చంద్రబాబు పేరును తాజాగా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో ఆ ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ కక్షతో చంద్రబాబును ఇరికించాలని గతంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినా ఇప్పుడు అరెస్ట్ చేశారని క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబుపై దాఖలైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేందుకు తగిన గ్రౌండ్స్ ను ప్రస్తావిస్తూ లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా రేపు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు ఈ పిటిషన్ లతోపాటు చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్రిమినల్ పిటిషన్ మెమొరాండాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను చేర్చారు. హైకోర్టులో రేపు చంద్రబాబుకు ఊరట లభించేలా తీర్పు వస్తుందని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.