టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రిమాండ్ కు వెళ్లిన తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ఒక్కతాటిపైకి రావాలని బాలయ్య పిలుపునిచ్చారు. అందుకోసం తాను వస్తున్నానని, ముందుండి నడుస్తానని ప్రకటించారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని టీడీపీ శ్రేణులకు, ప్రజలకు బాలయ్య బాబు ధైర్యం చెప్పారు. అందరూ కలిసి తెలుగోడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దామని, చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
చట్టాన్ని అతిక్రమించి జైలుకు పంపారని, అందుకే కుట్ర పన్ని లేని స్కాంను సృష్టించారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టు చేశారని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్త కాదని అన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు కాబట్టి చంద్రబాబును 16 రోజులైనా జైలుకు పంపాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. అని ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చెప్పుకుంటారని ప్రశంసించారు.
ఒక్క చాన్స్ అంటూ వచ్చి పన్నులతో ప్రజలను చావగొడుతున్నారని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడంపైనే జగన్ దృష్టి పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని , అందుకే ఈ కుట్రలకు తెరతీశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు వార్త విని గుండెపోటుతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు త్వరలో ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పారు. ఈ అక్రమ అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నారసింహ శతకంలోని ఓ పద్యాన్ని బాలకృష్ణ వినిపించారు.
గార్ధభంబున కేల- కస్తూరి తిలకంబు
మర్కటంబున కేల-మలయజంబు
శార్దూలముల కేల-శర్కరాపూపంబు
సూకరంబున కేల-చూతఫలము
మార్జాలమున కేల- మల్లెపువ్వుల బంతి
గుడ్లగూబకు నేల-కుండలములు
మహిషంబున కేల- నిర్మల వస్త్రముల్
బక సంతతికి నేల-పంజరంబు
మన రాష్ట్రమునకేలా ఈ సీఎం జగను!