స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడి అరెస్టు విషయంపై ప్రతిపక్ష పార్టీలు స్పందించిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టు, రిమాండ్ కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు జనసేన, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు మద్దతునిచ్చాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా బీజేపీ డైరెక్షన్లోనే సీఎం జగన్ ఇదంతా చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయగానే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెంటనే రియాక్టయ్యారు. ఈ అరెస్టు అక్రమమని స్పందించారు. కానీ ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. బాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ పురందేశ్వరి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు పలుకుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ లెటర్ వైరల్ అయింది. కానీ అది ఫేక్ అని స్వయంగా పురందేశ్వరే చెప్పారు. స్వయానా మరిది కాబట్టి బాబు అరెస్టుపై పురందేశ్వరి వెంటనే రియాక్టయ్యారని చెబుతున్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో సైలెంట్ అయిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితర జాతీయ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. కానీ బీజేపీ స్థానిక నేతలు కానీ, పక్క రాష్ట్రంలోని నాయకులు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. దీని వెనుక రకరకాల కారణాలున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం. అందుకే బాబు విషయంలో బీజేపీ సైలెంట్ గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.