టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అత్యంత భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా మనోవ్యధకు గురయ్యారు. చంద్రబాబు ఆయన పెళ్లి రోజున జైలుకు వెళ్లాల్సి రావడంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏసీబీ కోర్టు హాలులో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి కంటతడిపెట్టారు.
మామూలుగా చాలా కూల్ గా కనిపించే భువనేశ్వరి చంద్రబాబును చూసి భావోద్వేేగాలను నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంతోషంగా గడపవలసిన తన భర్త…జైలుకు వెళ్లాల్సి రావడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాము ఎంతో అభిమానించి పార్వతీపరమేశ్వరుల వంటి దంపతులు చంద్రబాబు-భువనేశ్వరిలకు వారి పెళ్లి రోజున ఈ దుస్థితి రావడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ కుటుంబమంతా తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయింది.
దాంతోపాటు చంద్రబాబు ఆరోగ్యంపై కూడా కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయనకు ఇంటి భోజనం, వైద్య సదుపాయం, మందులు తీసుకువెళ్లేందుకు జడ్జి అనుమతినివ్వడంతో కాస్త ఊరట లభించినట్లయింది. సైకో జగన్ కావాలనే చంద్రబాబు పెళ్లిరోజున ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. గతంలో వైసీపీ ఎంపీ రఘురామ రాజును కూడా ఆయన పుట్టినరోజు నాడు అరెస్టు చేసిన జగన్..అదే ఫక్కీలో చంద్రబాబును కూడా అరెస్టు చేయించారని దుయ్యబడుతున్నారు. తీర్పు వెలువడిన తర్వాత చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితర కుటుంబ సభ్యులు కలిశారు.