‘‘నేను 40 ఏళ్లుగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా… ఏ తప్పు చేయలేదు… ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే నడిరోడ్డుపై ఉరి తీయండి… కానీ ఎఫ్ఐఆర్లో నా పేరు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి’’ తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి అధికారులు, పోలీసులతో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. అయితే, ఆయన మాటలు పట్టించుకోని సిఐడి అధికారులు, పోలీసులు తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టులో వాదనలు జరుగుతున్న సందర్భంగా న్యాయమూర్తితో కూడా చంద్రబాబు ఇవే వ్యాఖ్యలు చేశారు.
తన తరఫున తానే వాదనలు వినిపించుకుంటానని న్యాయమూర్తికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీంతో, చంద్రబాబుకు స్వయంగా వాదనలు విడిపించుకునే అవకాశాన్ని న్యాయమూర్తి కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. తన అరెస్టు అక్రమమని, రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అక్రమ కేసులు, ఆరోపణలు చేస్తున్నారని న్యాయమూర్తికి చంద్రబాబు వాంగ్మూలం ఇచ్చారు. అందుకే, సిఐడి తనపై ఇచ్చిన రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు కోరారు. అంతేకాదు, గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని జడ్జితో చంద్రబాబు చెప్పారు.
ఇక, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయం ఆనాటి క్యాబినెట్ లో తీసుకున్నామని, 2015 బడ్జెట్ లో ఈ విషయాన్ని పొందుపరిచామని చంద్రబాబు వివరించారు. అంతేకాదు, 2021లో ఈ స్కామ్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైందని, అందులో తన పేరు లేదని చంద్రబాబు కోర్టులో వెల్లడించారు. ఈ క్రమంలోనే వాదనల సందర్భంగా కోర్టులోనే ఉంటారా అని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. అయితే, తాను కోర్టు హాల్ లోనే ఉంటానని చంద్రబాబు జవాబిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసిన నారా భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు.