టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ గా పాలన అందించిన సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబును అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒకటే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. 2021 ఎఫ్ఆర్ లో చంద్రబాబు పేరు లేదని తాజాగా ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో ఆయన పేరు ఎలా వచ్చిందనన్న ప్రశ్నకు సమాధానం ఇంకా వెల్లడి కావాల్సింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో రిమాండ్ రిపోర్టు సమర్పించిన తర్వాత సిఐడి అధికారులను న్యాయమూర్తి అదే ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడం, ఇప్పుడు చేర్చడానికి గల కారణాలు ఏమిటని సీఐడి అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆయన పిఏ శ్రీనివాసరావు ద్వారా ముడుపులు అందాయని, పారిపోయిన నిందితులు కొందరికి చంద్రబాబు అండగా ఉన్నారని సిఐడి ఆరోపణలు చేసింది.
ఇక, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు తాజాగా చేర్చడం, గతంలో ఎందుకు చేర్చలేదు అన్న ప్రశ్నలను అడగటంతో సిఐడి అధికారులతో పాటు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా షాక్ అయ్యారని తెలుస్తోంది. ఇక, ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత పది నిమిషాల పాటు న్యాయమూర్తి విరామం ప్రకటించారు. విరామం అనంతరం లూథ్రా, సుధాకర్ రెడ్డి వాడి వేడి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు హాల్ కి వచ్చిన నారా లోకేష్ తో, లాయర్లతో చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది.