టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు.. నంద్యాలలో అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసన చేపట్టారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్.. ఈ రోజ(శనివారం) ఉదయం తన తండ్రి అరెస్టు వార్త తెలిసి.. నంద్యాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయనను కదల నివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్‌కు, డీఎస్పీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టికల్ 19 ప్రకారం.. ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందంటూ.. రాజ్యాంగ ప్రతిని చూపించి మరీ నారా లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. తన తండ్రి అరెస్టు అయితే.. ఆయనను చూసేందుకు తాను వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు నారా లోకేష్ ను అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్నారు.
దీంతో నారా లోకేష్..త న కాన్వాయ్ వద్దే నేలపై కూర్చుని, చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసనకు దిగారు. ఇక, ఈ విషయం తెలిసిన జిల్లా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఘటనా ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. కొన్ని ప్రాంతాల్లో నాయకులను గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ.. నారా లోకేష్ తన నిరసనను విరమించేది లేదని, తనను తన తండ్రి వద్దకు వెళ్లేందుకు సహకరించాలని సూచించారు. ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు నివ్వెర పోయారు.