టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తనను రెండు రోజుల్లో అరెస్టు చేస్తారేమో అంటూ చంద్రబాబు వ్యాఖ్యలకు తగ్గట్లుగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న వైనం సంచలనం రేపింది. సీమన్స్-స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటున్నామని ఏపీ సీఐడీ, సిట్ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. క్రైమ్ నంబర్ 29/2021 కింద చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి తరలించి…అక్కడి నుంచి అమరావతిలోని సీఐడీ కేంద్ర కార్యాలయానికి లేదా విజయవాడకు తరలించే అవకాశముందని తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించిన ఆధారాలు లేకుండా, ఆ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తనని ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ కాపీ, అందులో చంద్రబాబు పేరు చూపించాలని చంద్రబాబు, ఆయన తరఫు న్యాయవాదులు సిట్ అధికారులను, సిఐడి అధికారులను, పోలీసులను నిలదీశారు. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేమని, ఆ స్కామ్ లో చంద్రబాబు పాత్రను కోర్టుకు వివరించిన తర్వాతే ఇక్కడకు వచ్చామని చెబుతున్నారు. ఎఫ్ ఐఆర్ కాపీలో తన చూపించాలని చంద్రబాబు, లాయర్లు ప్రశ్నించారు. డీకే బసు కేసు ప్రకారం 24 గంటల్లోపు చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపుతూ సంబంధింత పత్రాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. అవగాహన లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హై డ్రామా జరుగుతోంది. చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘురారెడ్డి, పలువురు పోలీసు అధికారులు, వందలాదిమంది పోలీసులు చేరుకున్నారు. అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేస్తారన్న వార్త దావానలంలా వ్యాపించడంతో భారీ సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.చంద్రబాబు బస చేసిన బస్సు డోరును పోలీసులు కొట్టి ఆయనను నిద్రలేపి అరెస్టు చేయాలని ప్రయత్నించారు. పోలీసులను లాయర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు హైడ్రామా మధ్య శనివారం ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు అని, పక్కా ప్లాన్ తోనే ఇపుడు అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టాలన్న జగన్ పంతం నెగ్గిందని దుయ్యబడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, వందలాది మంది పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? – @ncbn#WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan pic.twitter.com/Uwo7QXDFJD
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023