గత కొద్ది నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ స్కామ్ లో ఆప్ మంత్రి సిసోడియా అరెస్టు కావడం, ఆ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి, సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పేర్లు రావడం సంచలనం రేపింది. ఇక, ఈ స్కాం మొత్తంలో కీలకంగా మారిన సౌత్ సిండికేట్ కు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత కీలక సూత్రధారులని ఈడీ అధికారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం మాగుంట రాఘవరెడ్డి అప్రువర్ గా మారి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు వెల్లడించారు.
ఇదే కేసులో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రువర్ గా మారి రాఘవ రెడ్డితో పాటు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రవర్ గా మారడంతో జగన్ కు షాక్ తగిలింది. తాజాగా ఈ స్కామ్ కు సంబంధించిన కీలక పేర్లను, వివరాలను మాగుంట శ్రీనివాసులురెడ్డి..ఈడీ అధికారులకు అందించినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారంతో దూకుడు పెంచిన ఈడి కొంతమంది కీలక వ్యక్తులను విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి భారీ మొత్తంలో నగలు బదిలీ అయిన వ్యవహారంపై ఈడి దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది.
దక్షిణాదిలో కొంతమంది నుంచి ఢిల్లీ ప్రభుత్వంలోని ఆప్ కు చెందిన కీలక నేతలకు పెద్ద మొత్తంలో మనీ ల్యాండరింగ్ జరిగిన కోణంలో విచారణ జరుగుతోందని తెలుస్తోంది. అప్రువర్లుగా మారిన వారిచ్చిన సమాచారంతో హవాలా వ్యవహారాలతో సంబంధం ఉన్న 20 మందిని ఈడీ విచారణ జరిపింది. ఇక, కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా ఇటీవల మరోసారి ఈడీ విచారణ చేసింది. త్వరలోనే హైదరాబాద్ లో మరికొందరిని విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్ జగన్, కేసీఆర్ లకు షాక్ ఇచ్చిందని చెప్పాలి.