కష్టపడి పని చేసి.. వచ్చిన నాలుగు రాళ్లతో ఒకట్రెండు కూరల కంటే ఎక్కువ తినలేని పరిస్థితి ఉంటుంది. పనేమీ చేయకుండా నలుగురి ఇళ్లకు పోయి అడుక్కొని వచ్చినోడికి తేరగా ఐదారు రకాల కంటే ఎక్కువ రకాలే ఉంటాయి. అడుక్కునేటోడు అడగటం వరకు ఓకే. కాస్తంత కమ్మగా చేయొచ్చుగా? అంటే ఎలా ఉంటుంది? కాలి కంకరెత్తిపోదు. ఇప్పుడు అలాంటి పనే చేసింది ఐ బొమ్మ.
టెక్నాలజీ సాయంతో తేరగా కొట్టేసే సినిమాల్ని తన వెబ్ సైట్ లో ప్లే చేసే ఐబొమ్మ సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో సైబరాబాద్ కమిషనరేట్ లో ఐబొమ్మ మీద కేసు నమోదు చేయటం.. ఆ సైట్ ను బ్లాక్ చేయటం తెలిసిందే. ఓటీటీలో రిలీజైన సినిమాల్ని ఎలాంటి ఖర్చు లేకుండా అభిమానులకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా పని చేసే ఐ బొమ్మ కారణంగా.. రూపాయి ఖర్చు లేకుండా కొత్త సినిమాల్ని ఎంచక్కా చూసేస్తున్న పరిస్థితి. అయితే.. ఆ మధ్యలో కొంతకాలం పని చేయకపోవటం తెలిసిందే. తాజాగా ఐ బొమ్మకు చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
దాని సారాంశం ఏమంటే.. ఐబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. నిజంగానే ఐబొమ్మ వారు దాన్ని పోస్టు చేశారో? లేదంటే ఇంకెవరైనా ఆ పేరుతో ప్రచారం చేస్తున్నారో కానీ.. తెలుగు నిర్మాతలకు తాజాగా వార్నింగ్ ఇచ్చేశారు. మా మీద మీరు ఫోకస్ పెడితే.. మేం ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరిక జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది.
మా మీద ఫోకస్ చేయటం ఆపండి.. లేదంటే మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందంటూ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించనప్పటికీ.. ఇది ఎవరి పని? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజంగానే ఐబొమ్మ సంస్థే చేసిందా? లేదంటే.. ఇంకెవరైనా అలా చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఓవైపు ఉత్తరగా పైరసీ చేయటమే కాదు.. మళ్లీ వార్నింగ్ కూడానా?