ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి క్రికెటర్లలో ఒకడిగా శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌కు పేరుంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 800 వికెట్లు పడగొట్టిన బౌలర్ అతను. ఇంకెప్పటికీ కూడా ఆ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేరన్నది స్పష్టం. ఐతే ఇంత గొప్ప క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో మురళీధరన్ అధిగమించిన సవాళ్లెన్నో. ఆ సవాళ్లనే చూపిస్తూ ‘800’ అనే అంతర్జాతీయ సినిమా తీశారు.
తెలుగులో ‘ఆదిత్య 369’ సహా ఎన్నో మంచి సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న శివలెంక కృష్ణప్రసాద్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లెజెండరీ క్రికెటర్, భారతరత్న సచిన్ చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం. శ్రీలంకలో వివక్ష ఎదుర్కొని, ఎన్నో కష్టాలు అనుభవించిన పేద తమిళ కుర్రాడి స్థాయి నుంచి.. 800 వికెట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పే వరకు మురళీధరన్ సాగించిన ప్రయాణాన్నిఈ చిత్రంలో చూపించారు.
శ్రీలంక జాతీయ జట్టులోకి ఎంపిక కావడానికి ముందు అతను పడ్డ కష్టం.. అనతి కాలంలోనే మిస్టరీ స్పిన్నర్‌గా ఎదిగిన వైనం.. ఆ తర్వాత త్రో బౌలర్‌గా, చకర్గా ఆరోపణలు ఎదుర్కొని పరీక్షల ద్వారా క్లియరెన్స్ పొందడానికి ముందు ఎదుర్కొన్న అవమానాలు.. అంతిమంగా క్రికెట్ చరిత్రలోనే మేటి బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించడం.. ఇలా మురళీ జీవితంలోని ఒడుదొడుకులన్నీ సినిమాలో చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే అన్ని ముఖ్య కోణాలనూ చూపించినప్పటికీ.. ఎమోషనల్‌గా టచ్ చేసేలా అయితే ట్రైలర్ లేదు.
ఇందుక్కారణం మురళీ మనవాడు కాకపోవడం.. ఆ పాత్ర పోషించిన నటుడు అనామకుడు కావడం.. అతడి నటన కూడా సాధారణంగా అనిపించడమే కావచ్చు. ఎం.ఎస్.శ్రీపతి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘800’ను నిర్మించింది.‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ ఇందులో మురళీ పాత్రను పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://youtu.be/DLN0iI1oRrQ