ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి INDIA కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పేరుపై అప్పటినుంచి రచ్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య పోటీ అని, ఇండియాకు ఎదురొడ్డి ఎవరూ గెలవలేరని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ సర్కార్ ఇండియా పేరుపై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ఇండియా ను భారత్ అని పిలిచేలాగా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో జరుగుతున్న జరగబోతున్న జీ 20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జీ 20 దేశాధినేతలకు ఈనెల 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వబోతున్నారు. ఆ విందు కోసం పంపిన ఆహ్వాన పత్రికలలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఈనెల 18 నుంచి 22వ తేదీల మధ్య జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఈ పేరు మార్పు బిల్లును కూడా ఆమోదిస్తారని ప్రచారం జరుగుతుంది.
అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పేరు చూసి ప్రధాని మోడీ, బీజేపీ నేతలు భయపడుతున్నారని, అందుకే భారత్ అని మారుస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ దేశం ఒక పార్టీది కాదని, 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఒకవేళ రేపు ఇండియా కూటమి భారత్ అనే పేరు మార్చుకుంటే భారత్ పేరును బిజెపిగా మారుస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో భారత్ అనే పదం ఉందని, ఇండియాను భారత్ గా మార్చాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
అయితే, ఈ పేరు మార్పును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమర్థించుకున్నారు. భారత్ జోడో యాత్ర అని యాత్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పేరు మారిస్తే ఆ మార్పును ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. భారత్ మాతాకీ జై అని ఎందుకు అనలేకపోతున్నారని నిలదీశారు.