118 కోట్ల రూపాయల ముడుపులు చంద్రబాబు తీసుకున్నారంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని కొన్ని ఇంగ్లిషు పత్రికలలో కథనాలు వచ్చాయని ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాను నిజాయితీపరుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఈ ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎంపీ విజయసాయిరెడ్డిలతో పాటు పలువురు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.
అందుకు ఒత్తిడి, ఫ్రస్టేషన్, ఓటమి భయం కారణం కావచ్చని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. సజ్జలది ఆయన యజమానిది ఇతరుల బతుకులు గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదని చురకలంటించారు. బిడ్డల దగ్గరకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి పొందాల్సిన దుస్థితిలో సజ్జల నాయకుడు ఉన్నాడని, అటువంటి సజ్జల ఇతరుల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని దెప్పిపొడిచారు. రాబోయే మే నెలలో శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత తన బతుకేంటి అనే విషయాన్ని కూడా క్లర్క్ సజ్జల ఒకసారి ఆలోచించుకోవాలని ధూళిపాళ్ల సంచలన విమర్శలు చేశారు.
అంతకుముందు, చంద్రబాబుపై సజ్జలతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి పెద్ద స్కాం అని, ఇందులో భాగస్వామిగా ఉన్న సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితులు ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారని విజయసారెడ్డి అన్నారు. సిఆర్డిఏ ప్లానింగ్ లో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోలు, లక్ష కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్ జి పల్లంజి, ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో 118 కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్న చంద్రబాబు దానికి లెక్క చూపలేదని ఆ విషయంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని విజయసాయి అన్నారు.