టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ పేరు కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ‘తిరగబడరా స్వామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవి కుమార్…ఓ వివాదాన్ని తనతో పాటు తెచ్చుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ మన్నారా చోప్రాను మీడియా ముందు రవికుమార్ ముద్దు పెట్టుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. ఆ వివాదం సద్దుమణగక ముందే తాజాగా హీరో గోపీచంద్ పై అసభ్యకర పదజాలంతో రవి కుమార్ దుర్భాషలాడారు. గోపీచంద్ కెరీర్ తాను పెట్టిన భిక్ష అని, అటువంటి తనను కలిసేందుకు గోపీచంద్ ఇష్టపడడం లేదని పరుషపదజాలంతో దూషించారు. గోపీచంద్ ను తాను కలిసేందుకు ఐదారుగురిని దాటుకొని రావాలా…తనను వెయిట్ చేయమని చెప్పేంత గొప్పవాడు గోపీచందా..బలిసిందా గోపీచంద్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే రవికుమార్ పై గోపీచంద్ అభిమానులు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ కు, ఆయన ఫ్యాన్స్ కు రవికుమార్ క్షమాపణలు చెప్పారు. గోపీచంద్ తన తమ్ముడి వంటి వాడని, ఏదో ఆవేశంలో, ఆవేదనతో ఆ మాటలు అనేశానని వాపోయారు. గోపీచంద్ ఫ్యాన్స్ ని క్షమించమని అడుగుతున్నానని అన్నారు. గోపీచంద్ కు, తనకు ఎటువంటి గొడవలు లేవని క్షమాపణలు కోరారు. మరి ఇంతటితో ఈ వివాదాన్ని గోపీచంద్ ఫాన్స్ వదిలేస్తారా లేక సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారా అన్నది తేలల్సి ఉంది.