టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నల్లజర్లలో కల్లుగీత కార్మికులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే జగన్ పాలనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. బీసీలకు పుట్టినిల్లు టిడిపి అని, వారికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది తమ పార్టీనే అని లోకేష్ అన్నారు. దేవేందర్ గౌడ్ ను హోం మంత్రిని చేసిన ఘనత టిడిపిదేనిని, నవ్యాంధ్రలో కేఈ కృష్ణమూర్తిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేశామని లోకేష్ గుర్తు చేశారు.
కల్లుగీత కార్మికుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసి 105 కోట్లు ఖర్చు చేశామని, ఆదరణ పథకంలో భాగంగా పనిముట్లు, ద్విచక్ర వాహనాలు అందించామని గుర్తు చేసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. టిడిపి హయాంలో 50 శాతం సబ్సిడీతో 30 లక్షల రూపాయలు రుణాలు అందించామని, జగన్ ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదని దుయ్యబట్టారు. నల్లజర్ల లో 100% సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పెన్షన్లు వంటివి అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దామని గుర్తు చేశారు.
దానికి కృతజ్ఞతగా 2017లో నల్లజర్ల ప్రజలు చంద్రబాబునాయుడి పేరిట శిలాఫలకం ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ, గజదొంగ జగన్ వచ్చిన తర్వాత పంచాయతీల నిధులు 9000 కోట్లు దొంగిలించాడని ఆరోపించారు. అందుకే, పల్లెలు, గ్రామాలలో అభివృద్ధి నిలిచిపోయిందని దుయ్యబట్టారు. భీమా సొమ్మును 10 లక్షలు చేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారని, కానీ, ఆ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో సహాయం అందించినట్లుగానే కల్లుగీత కార్మికులకు కూడా అన్ సీజన్లో సాయం అందించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.