టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ అరెస్టు వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడడంతో చివరకు 41ఏ నోటీసులు ఇచ్చి ఆయనను పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి పెట్టాల్సి వచ్చింది. అయితే, ప్రభుత్వ అసంబద్ధ విధానాలపై, జగన్ పాలనపై తన గళం ఎత్తుతూనే ఉంటానని, తన చంపేసినా పర్వాలేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అయ్యన్న అరెస్టును టిడిపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఆయనను అరెస్టు చేసిన మాదిరిగా ఎంతమంది వైసీపీ నేతలను అరెస్టు చేయాలి అని టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలపై వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కేసులు ఉండవా అని పోలీసులను వర్ల ప్రశ్నించారు.
రాజకీయ నాయకులందరినీ ఒకేలా చూడాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఒకరిని నెత్తిన పెట్టుకొని మరొకరిని కింద పడేస్తామనడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఏపీలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఒకే చట్టం ఉండాలని సూచించారు. చట్టం కొందరికి చుట్టం కాకూడదని అన్నారు. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ ప్రభుత్వం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నారన్న నెపంతో ఐపిసి సెక్షన్ 153 ఏ పదేపదే ప్రతిపక్షాలపై ఉపయోగిస్తున్నారని, ఆ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.