అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. అసైన్డ్ భూములలో అవకతవకలకు పాల్పడ్డారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సిఐడి అధికారులు గతంలో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులపై గతంలోనే ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణలో భాగంగా ఇరువర్గాల వాదనలను ఏపీ హైకోర్టు పరిశీలించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు తీర్పును రిజర్వ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ చేసిన తీర్పు ఏ తేదీన వెలువరిస్తాము అన్న విషయాన్ని మాత్రం హైకోర్టు వెల్లడించలేదు. అమరావతిలో ఈ అసైన్డ్ భూముల కేసులో తుది విచారణ సందర్భంగా గతంలో కీలక వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎస్సీల దగ్గర భూములను తక్కువ రేటుకు బినామీలతో నారాయణ కొనుగోలు చేశారని సిఐడి ఆరోపిస్తోంది. వాటికి రక్షణగా జీవో నెంబర్ 41 తీసుకు వచ్చారని సిఐడి అధికారులు వాదనలు వినిపించారు. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలు బాధితులని, వారి స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు.
అప్పట్లో 18 కోట్లు ఉన్న భూముల విలువ ఇప్పుడు 600 కోట్లుగా మారిందని కోర్టు దృష్టికి సిఐడి అధికారులు తీసుకెళ్లారు. ఈ భూముల జీవో విడుదల సమయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ గా కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ గా చెరుకూరు శ్రీధర్ ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఎఫ్ ఐఆర్ ల మీద స్టే వుంటే ఏ విధంగా విచారణ జరిపారని పిటిషనర్ ప్రశ్నించారు. వేరే కేసులలో సిఐడి విచారణ చేయడంతో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సిఐడి తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల తుది వాదనలు విన్న హైకోర్టు ఈరోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.