టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్ తో కరచాలనం చేసేందుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎగబడుతున్నారు. అయితే, వరుసగా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోకేష్ ఎడమ భుజం తీవ్రంగా నొప్పి పుడుతోంది. అయినా సరే తన కోసం వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తూ పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు లోకేష్.
చింతలపూడిలో పామాయిల్ రైతులతో ముఖాముఖి సందర్భంగా జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. చింతలపూడి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారని, కానీ, ఆ ప్రాజెక్టును జగన్ నాశనం చేశాడని లోకేష్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టులో ఒక తట్ట మట్టి కూడా తీయలేదని జగన్ పై మండిపడ్డారు. విధ్వంసకుడు జగన్ అరాచకానికి….చేతల మనిషి చంద్రన్న సమర్థతకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అద్దం పడుతుందని అన్నారు. దాదాపు 5 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు దాదాపు 5వేల కోట్ల రూపాయల అంచనాలతో ఆ ప్రాజెక్టు పనులు చంద్రబాబు చేపట్టారని అన్నారు.
సగం డబ్బు ఖర్చు చేసి సగం పనులు పూర్తి చేశామని లోకేష్ చెప్పారు. కానీ, నిర్వాసిత రైతులకు కనీసం పరిహారం కూడా జగన్ ఇవ్వకుండా మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టమని, ఇసుకంటే ప్రేమని, కానీ, రైతులు, వ్యవసాయం అంటే ఎక్కడ లేని ద్వేషం అని లోకేష్ ఆరోపించారు. మొక్కలు, ఎరువులు, పురుగుమందులు వ్యవసాయ పనిముట్లు అందజేశామని, కానీ పామాయిల్ రైతులకు జగన్ ఏం చేశాడని నిలదీశారు. దేశంలో అత్యధికంగా పామాయిల్ పండిస్తోంది ఏపీ రైతులేనని, కానీ జగన్ దెబ్బకు పామాయిల్ రైతులు కూడా ఆయన బాధితులుగా మారారని ఆరోపించారు.
పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర రాకపోయినా వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పామాయిల్ పై దిగుమతి సుంకం 49 శాతం విధించేలా తమ హయాంలో చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు దిగుమతి సుంకాన్ని కేంద్రం ఎత్తివేసిన వైసిపి నేతలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. టిడిపి వచ్చిన తర్వాత పామాయిల్ రైతులను ఆదుకొని అన్ని హామీలు నెరవేరుస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కూడా టిడిపి మద్దతు ఇచ్చే పార్టీని అధికారంలోకి వస్తుందని లోకేష్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బీజేపీదే అధికారం అని పరోక్షం గా లోకేష్ కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది.