విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్నగారికి అరుదైన గుర్తింపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అన్నగారు చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రూ.100 నాణెం విడుదలైంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
దేశ సినిమా, రాజకీయ చరిత్రపై చెరగని ముద్ర వేసిన దివంగత నందమూరి తారకరామారావు గారి స్మారకార్థం వందరూపాయల నాణెంని గౌరవ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు ఆవిష్కరించారు. ఇది ఓ అద్భుత సందర్భం. అన్న ఎన్టీఆర్ గారికి దక్కిన అరుదైన గౌరవం.
ఓ విశ్వవిఖ్యాత..
తెలుగుజాతి భ… pic.twitter.com/asYGqSfvvj— Telugu Desam Party (@JaiTDP) August 28, 2023
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. భారత చలనచిత్ర రంగ పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలలో ఆయన జీవించారని, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ఎన్టీఆర్ లో దేవుళ్ళ రూపాలను ప్రజలు చూసుకుంటున్నారని అన్నారు. రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన నిత్యం పరితపించారని గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ పై దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఒక తరం హీరో మాత్రమే కాదని, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని ఆమె కొనియాడారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఒక తరానికే కాదని అన్ని తరాలకు ఆదర్శ హీరో అని అన్నారు. స్మారక నాణెం విడుదల చేయడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం అని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఉండరని, మహిళా సంక్షేమానికి ఎంతో పాటు పడ్డారని గుర్తు చేసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు.