టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగిసింది. దాదాపు 8 రోజులపాటు 113 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు కృష్ణా జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్రకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం శివారులో లోకేష్ కు ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలోనే ధర్మాజీగూడెం హెచ్ పి పెట్రోల్ బంకు దగ్గర జగన్ కి లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత జగన్ దే అని దుయ్యబట్టారు. జలగ బాదుడుకు జనం విలవిలాడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 లాగేయడం గజదొంగ జగన్ కి వెన్నతో పెట్టిన విద్య అని చురకలంటించారు. జగన్ పాలనలో రైతులు సాగునీటిని కొనాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. జగన్ ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు ఒక సెంటు పట్టా ఇస్తానని, జగనన్న ఇళ్ల పేరుతో 7000 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతలు తమ పార్టీ వారికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటున్నారని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని ప్రతి పేదవాడికి అధునాతన వసతులు, మౌలిక సదుపాయాలతో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీనిచ్చారు. తామే ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత స్థలం ఇచ్చి ఇల్లు మీరే కట్టుకోవాలి అంటున్నారని, దాదాపు ఆరు ఏడు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు.