వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ తెగ కష్టపడుతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయనే టాక్ ఉంది. అగ్ర నేతలు ఒక్కతాటిపైకి చేరి, పార్టీని అధికారంలో తెచ్చేందుకు పనిచేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాముందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం సీటుపై కన్నేసిన నేతలు ఆ పార్టీలో చాలా మందే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అందుకు మినహాయింపేమీ కాదనే చెప్పాలి. రేవంత్ కూడా సీఎం రేసులో ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆయన తరపున ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు దరఖాస్తు సమర్పించారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచి, సీఎం సీటుపై కూర్చోవాలన్నది రేవంత్ కోరికగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పార్టీని అధికారంలోకి తేస్తే కచ్చితం రేవంత్‌ను అధిష్ఠానం సీఎం చేసే సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. అందుకే రేవంత్ సిద్ధమవుతున్నట్లు టాక్.
2009, ,2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడంగల్‌లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ గెలిచారు. ఎంపీ అయినప్పటికీ కొడంగల్ నియోజకవర్గాన్ని మాత్రం రేవంత్ వదల్లేదు. ఇప్పుడు మరోసారి అక్కడ తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. మరోవైపు జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, నాగార్జున సాగర్ నుంచి రఘువీర్ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.